పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంటివద్ద బాంబును పోలీసులు కనుగొన్నారు. చండీగఢ్ లోని కన్సాల్-నయాగావ్..’టీ’పాయింట్ వద్ద సోమవారం దీన్ని కనుగొన్నట్టు వారు తెలిపారు. మాన్ నివాసానికి దగ్గరలోనే ఉన్న హెలిపాడ్ సమీపాన గల ఈ ప్రాంతంలో ట్యూబ్ వెల్ ఆపరేటర్ ఒకరు దీన్ని గుర్తించారు.
పేలుడు వస్తువుగా అనుమానించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు స్పాట్ కి చేరుకొని దీన్ని ‘లైవ్ బాంబు’ గా నిర్ధారించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ తో బాటు ఆర్మీకి కూడా తాము ఈ సమాచారం అందజేసినట్టు చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ నోడల్ అధికారి కుల్ దీప్ కోహ్లీ తెలిపారు.
ఘటన జరిగినప్పుడు మాన్ తన ఇంటిలో లేరని, ఇది ఇక్కడికి ఎలా వచ్చిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని ఆయన చెప్పారు. వీరితో బాటు ఇండియన్ ఆర్మీకి చెందిన వెస్టర్న్ కమాండ్ కూడా దీనిపై ఇన్వెస్టిగేషన్ చేయనుంది.
సిబ్బంది ఈ బాంబును పేలకుండా నిర్వీర్యం చేశారు. అత్యంత హై సెక్యూరిటీ జోన్ గా భావిస్తున్న ఈ ప్రాంతంలో బాంబ్ కనబడడం సంచలనం కలిగించింది. ఇక్కడే హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంతో బాటు పంజాబ్, హర్యానా సచివాలయ భవనాలు, అసెంబ్లీ భవనం కూడా ఉన్నాయి.