ఇండిగో విమానాలకు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. ఒకే రోజు రెండు విమానాశ్రయాలకు ఆగంతకులు బాంబు బెదిరింపు కాల్స్ చేశారు. అందులో ఒక కాల్ దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిర్ పోర్టుకు, మరొకటి తెలంగాణలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఆగంతకులు చేశారు.
రెండు విమానాశ్రయాల్లోనూ ఇండిగో విమనాల్లో బాంబు పెట్టామంటూ ఆగంతకులు వేర్వేరు కాల్స్ చేశారు. మొదట శంషాబాద్ నుంచి చెన్నై వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో రంగంలోకి దిగారు. ఎయిర్ పోర్టులో విస్తృత తనిఖీలు చేపట్టారు. చివరకు ఎయిర్ పోర్టులో ఎలాంటి బాంబూ లేదని నిర్దారించాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. టెక్నాలజీ సహాయంతో కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు.
కాల్ చేసింది భద్రయ్య గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తాను ఫ్లైట్ సమయానికి చేరుకోలేకపోయానని, బెదిరింపు కాల్స్ చేస్తే విమానం ఆలస్యంగా బయలు దేరుతుందని అలా చేశానని భద్రయ్య చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు ఢిల్లీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఢిల్లీ నుంచి ఒడిశాలోని దేవ్‌గఢ్‌కు వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అప్పటికే విమానం టేకాఫ్ కావడంతో దాన్ని లక్నోకు మళ్లించారు. పూర్తి స్థాయిలో పరిశీలించాక ఒడిశా వెళ్లేందుకు విమానాన్ని అనుమతించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది.