ఈ మధ్య కాలంలో ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లలకు వరుసగా వస్తున్న ఫేక్ బాంబ్ కాల్స్ కలకలం రేపుతున్నాయి. ఆకతాయిల పనులకు పబ్లిక్ తో పాటు భద్రతా సిబ్బంది టెన్షన్ పడాల్సి వస్తుంది. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బుధవారం రాత్రి ఇలాంటి ఫేక్ బాంబ్ కాల్ తోనే కలకలం రేగింది.
ఆగి ఉన్న బెల్గావి ఎక్స్ ప్రెస్ లో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, రైల్వే సిబ్బంది రైల్వే స్టేషన్ కు పరుగులు పెట్టి డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు.
దాదాపు అరగంట పాటు బళ్లారి రైలులో తనిఖీలు చేయగా బాంబు దొరక్కపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి సంగారెడ్డి దేవరంపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ బాలరాజుగా గుర్తించారు. అయితే ఎవరో ముగ్గురు వ్యక్తులు రైల్వేస్టేషన్లో బాంబు గురించి మాట్లాడుకుంటుండగా విని ఫోన్ చేసినట్లు అతడు పోలీసులకు వివరించాడు.