ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 6 ఆర్ఎస్ఎస్ కార్యాలయాలను బాంబులతో పేల్చివేస్తామని సోమవారం రాత్రి ఓ వ్యక్తి వాట్సాప్ లో బెదిరింపు సందేశం పంపారు. అప్రమత్తమైన ఉత్తరప్రదేశ్ పోలీసులు.. తమిళనాడు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన తమిళనాడు పోలీసులు.. లక్నో, ఉన్నవ్ నగరాల్లోని కార్యాలయాలను పేల్చివేస్తామని బెదిరింపులకు పాల్పడిన రాజ్ మహ్మద్ అనే వ్యక్తిని పట్టుకున్నారు.
ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ ఇచ్చిన సమాచారం మేరకు తమిళనాడులోని పుదుకోడి జిల్లాకు చెందిన మహ్మద్ ను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ ఏటీఎస్ బృందం ఇప్పుడు అనుమానితుడిని ట్రాన్సిట్ రిమాండ్ పై లక్నోకు తరలించింది. సైబర్ సెల్ సహాయంతో వాట్సాప్ ద్వారా సందేశం పంపిన నంబర్ ద్వారా నిందితుని ఆచూకి కనిపెట్టినట్టు లక్నో పోలీస్ నార్త్ డీసీపీ ఎస్ చన్నప్ప తెలిపారు.
ఈ బెదిరింపు మెసేజ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ప్రొఫెసర్ నీలకంఠ్ తివారీకి.. అంతర్జాతీయ ఫోన్ కాల్ నుంచి.. హిందీ, ఇంగ్లీషు, కన్నడ భాషల్లో వచ్చినట్టు వివరించారు. ఈ బెదిరింపు కాల్ కు సంబంధించి మడియాన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. యూపీలో 2, కర్ణాటకలో 4 ఆర్ఎస్ఎస్ కార్యాలయాలను పేల్చివేస్తామని ఆగంతకుడు బెదిరించారు. సైబర్ సెల్ సహాయంతో వాట్సాప్ సందేశం పంపినట్టు వెల్లడించారు. బెదిరింపు నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయాలకు పోలీసు బందోబస్తు పెంచామన్నారు.
ప్రొఫెసర్ నీలకంఠ్ తివారీకి రెండు రోజుల క్రితం, ఒక వ్యక్తి ‘అల్ అన్సారీ ఇమామ్ రాజీ ఉన్ మెహందీ’ అనే పేరుతో ఉన్న తన వాట్సాప్ గ్రూప్‌లో చేరమని కోరుతూ.. ఆయనకు ఆ వ్యక్తి లింక్ పంపాడు. దీని ద్వారా డాక్టర్ నీలకంఠ్ తివారీ తన బృందంలో చేరాడు. ఆ మరుసటి రోజు బాంబులతో కార్యాలయాలు పేల్చివేస్తామని బెదిరింపులతో కూడిని మెసేజ్ పంపాడు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్‌పూర్‌లో సంఘ్ శిక్షా వర్గ్ ముగింపు కార్యక్రమంలో మత సామరస్యానికి పిలుపునిచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ బెదిరింపు ఘటన జరిగటంతో అప్రమత్తమయ్యారు.