మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ నమోదైన కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ఫ్రొఫెసర్ జీ.ఎన్. సాయిబాబాకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసులో జీవితఖైదు విధించడంపై సవాల్ చేస్తూ ఆయన చేసుకున్న అపీల్ కు హైకోర్టు అనుమతిచ్చింది.
మహారాష్ట్రలోని గడ్చిరోలి ట్రయల్ కోర్టు ఆయనకు 2017లో యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
ఆయన పిటిషన్ పై జస్టిస్ రోహిత్ డియా, జస్టిస్ అనిల్ పన్సారేతో కూడిన నాగ్‌పుర్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది.
మరోవైపు ఇదే కేసులో మరో ఐదుగురు నిందితులు చేసుకున్న అప్పీల్‌ను కూడా ధర్మాసనం అనుమతించింది. దీనిపై విచారణ జరిపి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. అపీల్ విచారణలో ఉండగానే ఐదుగురు నిందితుల్లో ఒకరు మరణించారు. ఈ క్రమంలో మిగిలిన నలుగురు ఏ ఇతర కేసుల్లో నిందితులుగా ఉన్నప్పటికీ వారిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.