ఎల్గర్ పరిషత్ కేసులో నిందితుడిగా ఉన్న విరసం నేత వరవరరావుకు బాంబే హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. బెయిల్ పొడిగింపు కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది. అప్పటివరకు ముంబై తలోజా జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో వరవరరావుకు అప్పటివరకు ఉపశమనం దొరికినట్టయింది.
భీమా కోరేగావ్ యుద్ధ స్మరణ కోసం ఎల్గర్ పరిషత్ నేతృత్వంలో 2018 జనవరి 1న చేసిన ప్రయత్నం హింసకు దారితీసింది. ఈ అల్లర్లలో వరవరరావు ప్రమేయం ఉందని 2018లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును ప్రస్తుతం ఎన్ఐఏ విచారిస్తోంది. అప్పటి నుంచి విచారణ ఖైదీగా ఉన్న ఆయనకు ఆరు నెలల పాటు బెయిల్ మంజూరు చేసింది. అలా ఫిబ్రవరి 22న విడుదలైన వరవరరావు.. సెప్టెంబర్ 5న లొంగిపోవాల్సి ఉండగా, బెయిల్‌ను పొడిగింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణకు తగిన సమయం లేకపోవడంతో అక్టోబర్ 13 వరకు వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే వరవరరావు ఆరోగ్యం బాగానే ఉందని, ఆయన బెయిల్‌ను పొడిగించాల్సిన అవసరం లేదని కోర్టులో ఎన్ఐఏ అఫిడవిట్ దాఖలు చేసింది.