టైరు పేలడం ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ కాదని.. అది పూర్తిగా మానవ నిర్లక్ష్యమేనని తీర్పు ఇచ్చింది ముంబై హైకోర్టు. కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి పరిహారంపై కోర్టును ఆశ్రయించిన ఇన్సూరెన్స్ కంపెనీ పిటిషన్ ను విచారిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. డీటైల్స్ లోకి వెళ్తే.. 2010లో మకరంద్ పట్వర్థన్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పూణె నుంచి ముంబైకి వెళ్తున్నాడు. అయితే తన ఫ్రెండ్ కారును మితిమీరిన వేగంతో నడిపాడు. దీంతో వెనుక టైర్ పేలి లోతైన గుంతలో పడిపోయారు. ఈ ప్రమాదంలో మకరంద్ అక్కడికక్కడే చనిపోయాడు.
దీనిపై బాధిత కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ కంపెనీని ఆశ్రయించగా.. వారు యాక్ట్ ఆఫ్ గాడ్ గా పరిగణిస్తూ పరిహారాన్ని తిరస్కరించారు. దీంతో బాధిత కుటుంబం ఇన్సూరెన్స్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది. దీనిపై విచారించిన ట్రైబ్యునల్.. మృతుడి ఆదాయంపైనే కుటుంబమంతా ఆధారపడి ఉందని గుర్తించింది. రూ.1.25 కోట్ల పరిహారం ఇవ్వాలని బీమా సంస్థను 2016లో ఆదేశించింది.
అయితే ఇన్సూరెన్స్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ముంబై కోర్టును ఆశ్రయించింది బీమా సంస్థ. ట్రైబ్యునల్ ఆదేశించిన మొత్తం అధికంగా ఉందని.. టైర్ పేలడం యాక్ట్ ఆఫ్ గాడ్ అని వాదించింది. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు సంస్థ అభిప్రాయంతో విభేదించింది.
డిక్షనరీ ప్రకారం యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే మానవులు అదుపు చేయలేని సహజ శక్తి అని పేర్కొంది. కానీ టైర్ పేలడం అనేది పూర్తిగా మానవ నిర్లక్ష్యమేనని హైకోర్టు తేల్చి చెప్పింది. దీన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ గా చూపించి పరిహారం చెల్లించకుండా ఉండడం సరైంది కాదని ఇన్సూరెన్స్ కంపెనీకి సూచించింది ముంబై హైకోర్టు.