ఒక చట్టాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపేవారు దేశద్రోహులు, జాతి వ్యతిరేకులు కారని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఇఫ్తేకార్ షేక్(45)అనే వ్యక్తి పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనకు కూర్చోవడానికి అనుమతివ్వాల్సిందిగా కోర్టులో వేసిన పిటిషన్ పై విచారిస్తూ కోర్టు ఈ విషయం స్పష్టం చేసింది. నిరసన తెలపడానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఇఫ్తేకార్ కోర్టు నాశ్రయించారు.
”పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం సీఏఏ ను ఎవరూ వ్యతిరేకించకూడదన్నట్టుగా పోలీసుల వైఖరి ఉంది. పిటిషనర్ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసుకోవచ్చు. శాంతియుత నిరసన వ్యక్తం చేసే వారు దేశద్రోహులు, జాతి వ్యతిరేకులు కారు…ఒక చట్టాన్ని మాత్రమే వాళ్లు వ్యతిరేకిస్తున్నారు. అది నిరసనలో భాగం..” అని డివిజన్ బెంచ్ జస్టిస్ టీవీ నలవాడే, జస్టిస్ఎంజీ సెవ్లీకర్ వ్యాఖ్యానించారు. ”శాంతియుత ఉద్యమాల వల్లనే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశ ప్రజలు ఇప్పటికి అహింసాయుత ఉద్యమాలు చేయడం మన అదృష్టం…ప్రస్తుతం ఇక్కడ పిటిషనర్ కూడా శాంతియుత ఉద్యమం చేయాలనుకుంటున్నారు” అని బెంచ్ వ్యాఖ్యానించింది.