హైదరాబాద్ రాజ్‌భవన్‌లో బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. రాజ్ భవన్‌లో నివసించే కుటుంబాలతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. రాజ్ భవన్ ప్రాంగణంలోని ఆలయంలో అమ్మవారికి ‘బోనాలు’ సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు తమిళి సై. పండుగ వెనుక ఎంతో చరిత్ర ఉందని అన్నారు. అషాడ, శ్రావణ మాసాల్లో బోనాల పండుగను ఎంతో భక్తితో నిర్వహిస్తారన్నారు. ఆషాడ మాసంలో ఎక్కువగా నల్ల పోచమ్మను కొలుస్తారని తెలిపారు. ఈ సంవత్సరం బోనాల పండగ నిర్వహించేందుకు ఒక ప్రత్యేకత ఉందని… అమ్మవారి దయవల్ల సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని గవర్నర్ చెప్పారు.
అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని గవర్నర్ తమిళి సై మనస్ఫూర్తిగా కోరుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని పేర్కొన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ బుస్టార్ డోసు వేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తుందని తెలిపారు. వరదలు సంభవిస్తున్న కారణంగా అందరూ జాగ్రత్తగా ఉండాలని గవర్నర్ తమిళిసై సూచనలు చేశారు.
మరోవైపు ఆదివారం భాగ్యనగరంలో జరిగే బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఊరూవాడా అమ్మవారి ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. బోనాలకు ఆయా ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఆలయాలన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. రేపు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు ఆయా ప్రాంతాల్లో అమ్మవార్లకు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించనున్నారు.