విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచార బాధితురాలి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఆర్ధిక సాయం చేసింది. టీడీపీ తరపున ఆ పార్టీ నేత బోండా ఉమ, వంగలపూడి అనిత రూ.5 లక్షలు అందజేశారు. ఈ సందర్బంగా బోండా ఉమ మీడియాతో మాట్లాడుతూ.. మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, మంత్రి రోజాపై ఫైర్ అయ్యారు.
రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని మండిపడ్డారు. వనజాక్షి, కాల్ మనీ సెక్స్ రాకెట్ అంటూ టీడీపీపై విమర్శలు చేయడం ఏంటని నిలదీశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా.. ఇన్నాళ్లూ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో 800 మంది మహిళలపై దాడులు జరిగితే ఏం చేశారని ఆయన నిలదీశారు. ప్రభుత్వం పై చేస్తున్న పోరాటంలో వెనక్కు తగ్గేది లేదన్నారు. బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తాము బాధిత కుటుంబానికి అండగా ఉంటే నోటీసులిచ్చారని మండిపడ్డారు.
మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు మహిళా కమిషన్ అధికారాలు, హక్కులు ఆమెకు తెలుసా? అని ప్రశ్నించారు. అనర్హత కలిగిన వ్యక్తి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారని, ఆమె రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆమెను పదవి నుంచి తప్పించాలని బోండా ఉమా డిమాండ్ చేశారు.