మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత బొండా ఉమ మండిపడ్డారు. టీడీపీపై విషప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని.. జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెడితే టీడీపీ అడ్డుకుంటోందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దమ్ముంటే ఎన్టీఆర్ పేరు వద్దన్నట్లు ఆధారాలుంటే చూపాలని సవాల్ విసిరారు.
కొడాలి నానికి తన శాఖలో ఉన్న తప్పులు, లెక్కలపై కనీస అవగాహన ఉందా? అని ప్రశ్నించారు ఉమ. అర్ధరాత్రి అశోక్ బాబును అరెస్ట్ చేయడమేంటని ఫైరయ్యారు. కేసినో పెట్టి మహిళలతో డ్యాన్స్ లు వేయించిన నానిపై కేసు లేదన్నారు. ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.
అప్పుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపినందుకు ప్రభుత్వం గిన్నిస్ రికార్డు సాధిస్తుందని ఎద్దేవ చేశారు ఉమ. వైసీపీ స్వార్థ రాజకీయాల కోసమే ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని విమర్శించారు.
రాష్ట్రంలో సంపద సృష్టించి ఉంటే వైసీపీ ఎంపీలు కేంద్రం ముందు అప్పుల కోసం తల దించాల్సి వచ్చేదా..? అని బొండా ఉమ ప్రశ్నించారు. ఒకప్పుడు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా ఉన్న ఏపీ పరువును అప్పుల కోసం పణంగా పెడుతున్నారని ఆరోపించారు.