ఏపీలో కేసినో వ్యవహారం కాక రేపుతోంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య పంచ్ లు ఓ రేంజ్ లో పేలుతున్నాయి. తన కల్యాణ మంటపంలో కేసినో నిర్వహించానని నిరూపిస్తే సూసైడ్ చేసుకుంటానని మంత్రి కొడాలి నాని సవాల్ చేయగా.. నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని టీడీపీ నేత బొండా ఉమ ప్రశ్నించారు.
కొడాలి నాని దొరికిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఉమ. మంత్రి సవాల్ ను స్వీకరిస్తున్నామన్న ఆయన.. కేసినో జరిగిందని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎప్పుడు రావాలో చెప్పాలని కౌంటర్ సవాల్ విసిరారు. అంతటితో ఆగకుండా చెరో పెట్రోల్ డబ్బా తెచ్చుకుందాం.. తేల్చుకుందామన్నారు బొండా ఉమ.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా గుడివాడలో కేసినో నిర్వహించారని కొడాలి నానిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆయన నిరూపించాలని సవాల్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వేసింది. అయితే.. కమిటీ సభ్యులు గుడివాడ వెళ్తే.. వారి వాహనాలపై దాడి జరిగింది. దీంతో ఇరు పార్టీల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది.
కేసినోలో డ్యాన్స్ లు వేసిన వారి పేర్లు తమ దగ్గర ఉన్నాయని అన్నారు బొండా ఉమ. విక్టర్, శశిభూషణ్ వంటి వాళ్లు డ్యాన్స్ లు వేశారని… కరోనా వచ్చిందని హైదరాబాద్ లో ఉంటే చేసిన తప్పులు పోతాయా? అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా కేసినో వీడియోలను మీడియాకు విడుదల చేశారు ఉమ.