ఆషాడ బోనాలకు ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. జూన్ 22 నుంచి బోనాలు మొదలు కానున్నాయి. అయితే ముందు గోల్కొండ కోటలోని ఎల్లమ్మకు తొలి బోనం ఎక్కించిన తరువాత నెల రోజుల పాటు ఈ బోనాల జాతర కొనసాగనుంది.
ఇక జులై 9 సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 16న పాతబస్తీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల పండుగను రాష్ట్ర పండుగగా సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 15 కోట్లు కేటాయించిందన్నారు మంత్రి తలసాని.
హైదరాబాద్ బేగంపేట్ లోని హరిత ప్లాజాలో బోనాల ఏర్పాట్లపై మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మేయర్ విజయలక్ష్మి, డీజీపీ అంజనీకుమార్, అదే విధంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.