– నిజం లాంటి అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట
– తెలంగాణ చరిత్రను సైతం వక్రీకరించారు
– ఉద్యమకారుల కుటుంబాలకు బుక్కెడు బువ్వ పెట్టారా?
– ఎక్కడైనా ఉద్యమకారుడంటే ఆస్తులు పోగొట్టుకోవడం చూశాం..
– కానీ.. కేసీఆర్ తరతరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించారు
– సీఐ నాగేశ్వరరావును ఎందుకు పట్టుకోలేదు
– యువరాజుతో సత్పంబంధాలే కారణమా?
– కేసీఆర్ పై రేవంత్ ఫైర్
కేసీఆర్ అత్యంత దిగజారిన రాజకీయ నాయకుడని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం రచించిన దాలి & చేదు నిజం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పసునూరి రవీందర్ అధ్యక్షతన ఈ ప్రోగ్రాం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చరిత్ర ఎప్పుడూ గెలిచిన వ్యక్తి రాసుకుంటాడని.. కేసీఆర్ తెలంగాణ చరిత్రను వక్రీకరించారని ఆరోపించారు. ఆయన నిజం లాంటి అబద్ధాలను చెబుతుంటారని అన్నారు.
ఉద్యమంతో ఆర్థికంగా, రాజకీయంగా కేసీఆర్ బలపడ్డారని వివరించారు రేవంత్. ఉద్యమకారులు త్యాగాలు చేస్తారు తప్ప.. శ్రీమంతులు కాలేదని గుర్తు చేశారు. కేసీఆర్ ఉద్యమకారుడైతే.. ఫాంహౌస్, పదవులు, కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసేవాడే ఉద్యమకారుడని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసిన వాళ్లను కనుమరుగు చేశారని అన్నారు. కేసీఆర్ చదువుకున్న తెలివిగల అబద్దాలకొరు అని అభివర్ణించారు. ఆయనకు కాలం కలిసి వచ్చింది తప్ప తెలంగాణ ఉద్యమ పోరాటంలో కేసీఆర్ పాత్ర ఏం లేదన్నారు.
కేసీఆర్ నిజాం నవాబ్ కంటే ఎక్కువ చేసిందేమీ లేదన్న రేవంత్.. బర్రెలు, గోర్రెలు మనకిచ్చి రాజ్యం కేటీఆర్ కు అందిస్తున్నారని విమర్శించారు. సీఎం నయా ఫ్యూడలిజం తీసుకవచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ దళితులకు, గిరిజనులకు భూమి, ఇళ్లు, నీళ్ళు ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి రూ.69 వేల కోట్లు ఉన్న అప్పు.. ఇప్పుడు రూ.5 లక్షల కోట్లకు ఎలా చేరిందని నిలదీశారు. గాంధీ కుటుంబం ఎప్పుడూ తమ పిల్లలు రాజకీయాల్లోకి రారని చెప్పలేదన్న ఆయన.. కేసీఆర్ మాత్రం ఆనాడు తమ కుటుంబం నుంచి ఎవరూ రారని చెప్పారని గుర్తు చేశారు. ఆ మాట మీద నిలడనందుకే ప్రశ్నిస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏర్పాటు చేస్తానన్న సలహా మండలి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు రేవంత్. వర్గీకరణ కోసం 25 ఏళ్ల నుంచి మంద కృష్ణ మాదిగ చేస్తున్న ఉద్యమం కంటే గొప్పదా.. నీ ఉద్యమం అంటూ కేసీఆర్ ను నిలదీశారు. అమరులు శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాలకు ఏం చేశారని ప్రశ్నించారు. కనీస మానవత్వం కూడా లేని ఈ సీఎం ఒక్కనాడైనా అమరుల కుటుంబాలకు బుక్కెడు బుబ్బ పెట్టడా అంటూ విరుచుకుపడ్డారు. కొడుకు ఇంటికి రాలేదని సచివాలయం కూలగొట్టి కొత్త కడుతున్నాడని.. అమరుల స్తూపం కట్టే వాడు, దానికి కావలి ఉన్నవాడు ఆంధ్రోడే అని తెలిపారు.
ప్రతీ ఊళ్ళో మందు షాప్ లు పెట్టి అనేక మంది జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్. పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీ ఆడబిడ్డల్ని వివస్త్రలను చేసి కొట్టిన చరిత్ర కేసీఆర్ దేనని ఫైరయ్యారు. గన్ గురి పెట్టి అత్యాచారం చేసిన సీఐ కేసీఆర్ కుటుంబానికి ఎంతో సన్నిహితుడని, ర్యాడిసన్ పబ్ వివరాలు అన్నీ అతని దగ్గరే ఉన్నాయన్నారు. దాంట్లో యువరాజు చిట్టా అంతా ఉందని, ఈ కేసులో తనను ఇరికిస్తే… నిన్ను ఇరికిస్తా అని బెదిరిస్తున్నారని.. పోలీస్ అత్యాచారం చేస్తే పట్టుకోలేక పోతుందా ఈ వ్యవస్థ.. కేసు తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు.
విమలక్కపై ఉమ్మడి రాష్ట్రంలో కేసులు పెట్టే ధైర్యం కూడా చేయలేదని… తెలంగాణ వచ్చాక కేసులు పెట్టారని గుర్తు చేశారు. విమలక్క పాటల మీద ఉద్యమం చేసి ఆమెనే అణచివేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి విజ్ఞత చూపించుకోవాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కి అధికారం ఇవ్వాలని కోరారు రేవంత్ రెడ్డి.
ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ.. ప్రొఫెసర్ కేశవ్ రావు జాదవ్ లేనిదే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేది కాదన్నారు. నాడు జనాలను వేధించిన రజాకార్ల పెద్దన్న అయిన నిజాంను రాజుని చేసినట్టే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే వాళ్ళే నేడు మంత్రి వర్గంలో ఉన్నారని చెప్పారు. బ్యాక్ టూ డెమోక్రసీ అనే నినాదంతో మరో ఉద్యమం చెయ్యాలని పిలుపునిచ్చారు యాదగిరి.