పుస్తకాలను అంటే సహజంగా పేపర్‌తో తయారు చేస్తారు. వాటిని మందమైన అట్టలతో బైండింగ్ చేస్తారు. కానీ మనిషి చర్మాన్ని ఎవరైనా పుస్తకం తయారీకి ఉపయోగిస్తారా..? అని మీకు సందేహం రావచ్చు. కానీ ఇది నిజమే.. నిజంగా మనిషి చర్మంతో తయారు చేయబడిన ప్రపంచంలోని ఏకైక పుస్తకం ఒకటి ఉంది. అది హార్వార్డ్ యూనివర్సిటీలో ఉంది.
హార్వార్డ్ యూనివర్సిటీలోని హౌటన్ లైబ్రరీలో మనిషి చర్మంతో తయారు చేసిన పుస్తకం ఒకటి ఉంది. దాని పేరు Des destinées de l’ame (Destinies of The Soul). 1930 నుంచి ఆ పుస్తకం ఆ లైబ్రరీలో ఉంది. దాన్ని 1880లో తయారు చేశారు. 99.9 శాతం మనిషి చర్మంతో ఆ పుస్తకాన్ని బైండింగ్ చేశారు. అందులో ఫ్రెంచ్ లో రాయబడిన ఒక నోట్ కూడా మనకు కనిపిస్తుంది. అందులో ఏముంటుందంటే…
ఈ పుస్తకాన్ని మనిషి చర్మంతో బైండింగ్ చేశారు. దాని అసలు స్థితిని అలాగే ఉంచేందుకు ఎలాంటి ఆభరణాలను అలంకరించలేదు. ఆ పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే.. దానిపై మనిషి చర్మం మీద ఉండే రంధ్రాలు సులభంగా కనిపిస్తాయి. మనుషులకు సంబంధించిన పుస్తకం కనుక మనిషి చర్మం కవర్ మీద ఉంటే బాగుండుననిపించింది. ఓ మహిళ వీపు నుంచి తీసిన చర్మంతో ఈ పుస్తకాన్ని తయారు చేశాను. అలాగే మరో పుస్తకం Pinaeus de Virginitatis notis ను కూడా మనిషి చర్మంతోనే తయారు చేశాను. కానీ అది ట్యానింగ్ చేయబడింది.
అయితే నిజానికి 15వ శతాబ్దంలో మనిషి చర్మంతో పుస్తకాలను తయారు చేసే పద్ధతి ఉండేదట. కానీ దాన్ని ఆ తరువాతి కాలంలో మానేశారు. అయితే Destinies of The Soul పుస్తకాన్ని తయారు చేసేందుకు గాను స్ట్రోక్ కారణంగా చనిపోయిన ఓ మహిళ వీపు మీది చర్మాన్ని తీసుకున్నారట. ఆమె మృతదేహాన్ని ఎవరూ తీసుకోకపోతే.. సదరు రచయిత తన పుస్తకం కోసం ఆమె చర్మాన్ని తీసుకున్నాడట. ఇక ఆ రచయిత తెలిపిన మరో పుస్తకం (Pinaeus de Virginitatis notis) వెల్‌కమ్ లైబ్రరీ (Wellcome Library) లో ఉంది.