గత వారంలో నష్టాలతో కొట్టుమిట్టాడిన అంతర్జాతీయ మార్కెట్ లు సోమవారం లాభాల బాట పట్టాయి. మార్కెట్లలో కాస్త సానుకూల సాంకేతాలే వినిపిస్తున్నాయి. దేశీయంగా మంగళవారం వెలువడనున్న బడ్జెట్ పై ఆశాజనకంగా ఉన్న మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో నేటి ట్రేడింగ్ ను సూచీలు బలంగా ఆరంభించాయి.
సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా ఎగబాకగా.. నిఫ్టీ 17వేల మార్క్ పైన ట్రేడ్ అవుతోంది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 756.65 పాయింట్ల లభంతో 57,956.88 వద్ద.. నిఫ్టీ 233.25 పాయింట్ల లాభంతో 17,335.20 వద్ద కొనసాగుతున్నాయి.
విప్రో, ఓఎన్‌జీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు రాణిస్తున్నాయి. ఎల్ అండ్ టీ, ఎన్‌టీపీసీ షేర్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఆర్థిక రికవరీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవచ్చని మదుపర్లు ఆశిస్తున్నారు.
5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగాల సృష్టి, వృద్ధి ఆధారిత పెట్టుబడులు బడ్జెట్ లో ప్రకటించొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయని చెప్తున్నారు. అయితే గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ జరగొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.