ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో టీమ్ ఇండియా జట్టు పట్టుబిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ లో నిప్పులు చెరిగాడు. 207 బంతులు ఆడిన హిట్ మ్యాన్ 120 పరుగులు చేశాడు.
తన బౌలింగ్ తో ఆసిస్ వెన్ను విరిచిన జడేజా అటు బ్యాటింగ్ లోనూ అద్భతమైన ఆట తీరు కనబరిచాడు. 170 బంతుల్లో 66 పరుగులు చేశాడు. టీమిండియా బ్యాటర్ అక్షర్ అర్థ సెంచరీతో చెలరేగిపోయాడు. ఆసీస్ యువ బౌలర్ టాడ్ ముర్ఫీ తన బౌలింగ్ ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు.
ఇన్నింగ్స్ లో ముర్ఫీ 5 వికెట్లు పడగొట్టాడు. పాట్ కమ్మిన్స్, స్కాట్ బోలాండ్ చెరో వికెట్ తీశారు. ఓవర్ నైట్ స్కోర్ 77/1 వద్ద ఈ రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు 321 పరుగులు చేసింది. అంతకు ముందు రోజు ఆసీస్ 63.5 ఓవర్లలో 177 పరుగులకు కుప్పకూలింది.
భారత బౌలర్లలో జడేజా 5 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ 3, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు. ఆసిస్ జట్టులో మార్నస్ లబుషేన్ 49 పరుగులు చేశాడు. స్టీవ్ స్మిత్ (37), అలెక్స్ క్యారీ (36), హ్యాండ్స్ కాంబ్ (31) ఫర్వాలేదనిపించారు.