మనలో చాలా మందికి బోర్ కొడితే పాటలు వినడం, సినిమాలు చూడటం లాంటివి చేస్తుంటాం. అప్పటి మందం ఏదో ఒక కాలక్షేపాన్ని ఎంచుకుని బోర్ ను దూరం చేసుకుంటాము. అది మనుకు సంతోషాన్ని కలిగిస్తుంది.
అయితే అందరిలాగే ఓ సెక్యూరిటీ గార్డు కూడా బోర్ కొడుతున్న సమయంలో బొమ్మలు వేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పెన్ను అందుకుని తన పనితనం చూపించాడు. కానీ ఆయన చేసిన పనితో అతను పనిచేస్తున్న కంపెనీకి ఏకంగా ఏడు కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. అసలు ఎందుకంత నష్టం వచ్చిందని అనుకుంటున్నారా అయితే వార్త చదవండి.
అన్నా లెపోర్స్కాయ 1932-1934లో త్రీ ఫిగర్స్ అనే ప్రఖ్యాత చిత్రాన్ని గీశారు. ఆ చిత్రాన్ని రష్యాలోని బోరీస్ యెల్స్టీన్స్ అనే ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు ఉంచారు. అక్కడ నుంచి ఆ పెయింటింగ్ ను తీసుకు వచ్చి ‘ది వరల్డ్ యాజ్ నాన్-ఆబ్జెక్టివిటీ, ది బర్త్ ఆఫ్ ఎ న్యూ ఆర్ట్’ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శన నిమిత్తం ఉంచారు.
అక్కడ ఎగ్జిబిషన్ లో పనిచేస్తున్న ఓ ప్రైవేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుకు బోర్ కొట్టింది. రోజు ఆ చిత్రాలను చూస్తూ ఉండటం వల్ల బొమ్మలు గీయాలని పించిందో… లేదా ఆ చిత్రంలో లోపం ఉందనుకున్నాడో తెలియదు కానీ ఆ పెయింటింగ్ లో ఉన్న ముఖ చిత్రాలపై బాల్ పాయింట్ పెన్ తో కళ్లను గీశాడు.
సెక్యూరిటీ చేసిన ఆ పనితో అరుదైన ఆ పెయింటింగ్ డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజిని సరిచేయడానికి రూ. 2 లక్షల 50 వేల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే అంత ఖర్చు చేసినా పూర్తిగా సరిచేయగలమా అన్నది సందేహమని చెబుతున్నారు.
అందువల్ల ఆ పెయింటింగ్ విలువ ఎంత ఉంటుందో అని తెలుసుకునే పని మొదలు పెట్టారు. కానీ ఆ పెయింటింగ్ విలువ ఎంత ఉందనే విషయంపై సరైన నిర్దారణకు రాలేకపోయారు. ఆల్ఫా ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఆ చిత్రానికి 7.5 కోట్లకు ఇన్స్యూరెన్స్ చేసి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కంపెనీ వాళ్లు తలలు పట్టుకున్నారు. ఈ పనికి కారణమైన సెక్యూరిటీని విధుల నుంచి తొలగించారు.