సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఛలో సీఎంఓ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు ఎవరూ తాడేపల్లి వైపు వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున అరెస్టులు, నిరసనలతో విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై తాజాగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.
ప్రజాస్వామ్య వ్యవస్ధలో ముఖ్యమంత్రి ఇళ్లు ముట్టడించాలనుకొనే చర్య ధర్మమేనా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అవకాశం ఉన్నంతవరకు ప్రతి అంశాన్ని పరిష్కరిస్తోందని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు.
సీపీఎస్ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కమిటీ వేశామని.. ఆ కమిటీ అన్ని విషయాలను పరిశీలిస్తుందని తెలిపారు. దానిపై మళ్లీ ఓ సమావేశం కూడా జరగనుందని చెప్పారు. ఆ కమిటీ నిర్ణయం వచ్చిన తరువాత సీపీఎస్ అంశంపై ప్రభుత్వం స్పందిస్తుందని తెలిపారు. విద్యా శాఖలో సంస్కరణలు దశల వారీగా వస్తాయన్నారు.
55 వేల ప్రభుత్వ స్కూళ్లను నాడు నేడు ద్వారా అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. ఉన్నత విద్యకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి బొత్స మండిపడ్డారు.