వారిద్దరు ఒక తల్లిబిడ్డలు. అమ్మపెట్టిన గోరుముద్దలు తిన్నారు. హాయిగా ఒడిలో పడుకుని అమ్మచెప్పే కథలు, కబుర్లు వింటూ సాగిపోతున్న బాల్యం వారిది. ఆ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకున్నారు.
కానీ విధివైపరీత్యం ఎలా ఉంటుందో ఆ పసివాళ్లకు తెలియదు. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఆ అక్కా తమ్ముళ్లు విడిపోయారు. అక్క భారత దేశంలో తమ్ముడు పాకిస్థాన్ లో పెరగవలసి వచ్చింది.
సుమారు 75 సంవత్సరాల తర్వాత ఆ అక్కాతమ్ముళ్లు కలిసారు. ఏళ్లతర్వాత కలుసుకున్న రక్తసంబంధం కన్నీటి పర్యంతమయ్యింది.ఈ అద్భుత అరుదైన దృశ్యానికి సిక్కుల పవిత్ర స్థలమైన ఖర్తార్‌పూర్ కారిడార్ వేదిక అయ్యింది.
భారత్‌లో ఉంటున్న మహేందర్ కౌర్ (81), పాకిస్థాన్‌లోని ఆక్రమిత కశ్మీర్లో ఉంటున్న 78 ఏండ్ల షేక్ అబ్దుల్ అజీజ్ ఒకరిని ఒకరు చూసుకున్న క్షణాలు గుంటపడ్డ కనుల వెంట ఆనంద భాష్పాలుగా వర్షించాయి.
తన తమ్ముడిని చూసి ఆలింగనం చేసుకున్న కౌర్ అతని చేతిపై ముద్దుల వర్షం కురిపించింది. ఈ దృశ్యాలను చూసిన ఇరు కుటుంబాలు పాటలు పాడుతూ, వారిపై పూలను చల్లుతూ, స్వీట్లు పంచుతూ ఆ సంతోషాన్ని వారితో పంచుకున్నారు.సర్దార్ భజన్ సింగ్ కుటుంబం భారత్‌లోని పంజాబ్‌లో నివసించేది. అయితే దేశ విభజన సమయంలో మహేందర్ కౌర్ తండ్రితో ఇండియాలోనే ఉండిపోగా తప్పిపోయిన అజీజ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు వెళ్లిపోయాడు.
అక్కడే అతను వివాహం చేసుకుని నివసిస్తున్నా నిత్యం భారత్‌లోని తన తల్లిదండ్రులు, బంధువులు, సోదరి కోసం తపించేవాడు. కాలక్రమేణా ఇంక కుటుంబ సభ్యుల గురించి ఆశలు వదులుకున్నాడు.
అయితే సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ కారణంగా తన వారిని గుర్తించాడు. దీంతో తన తోబుట్టువును కలుసుకునేందుకు వచ్చాడు. వీల్ చైర్ల మీద వచ్చిన ఇద్దరూ కలిసిన ఉద్విగ్న దృశ్యాలను ఇరు కుటుంబాల వారు ఆనందంగా వీక్షించి వేడుక చేసుకున్నారు.