పెళ్లికి ప్రేయసి ఒప్పుకోలేదని ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. ఆమె గొంతు కోశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె చావుబతుకుల మధ్య పోరాడుతుంది. ఈ దారుణమైన సంఘటన హనుమకొండ జిల్లా కాజీపేటలో చోటుచేసుకుంది.
కాజీపేట మండలం కపిడికొండకు చెందిన శ్రీనివాస్ తన గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ప్రేమించింది. అయితే ఇద్దరి మతాలు వేరు. అందుకే శ్రీనివాస్ ఆమె కోసం తన మతం కూడా మార్చుకున్నాడు. కొంత కాలం వీరిద్దరి ప్రేమ బాగానే సాగింది. అయితే వీరి పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోక పోవడం ట్విస్ట్ ని ఇచ్చింది.
దీంతో ఇద్దరి మధ్య కొద్ది రోజులుగా గొడవలు మొదలయ్యాయి. నిన్న రాత్రి ఇదే విషయమై శ్రీనివాస్ యువతి ఇంటికి వెళ్లాడు. పెళ్లి గురించి మరోసారి యువతిని నిలదీశాడు. అయితే అప్పుడు తమ కుటుంబ సభ్యులు వద్దన్నారని పెళ్లికి యువతి నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ పథకం ప్రకారం తనతో తెచ్చుకున్న కత్తితో యువతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
యువతి గొంతు,చేయి కోశాడు. దీంతో యువతి కేకలు వేయడంతో.. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని యువకుడిపై దాడి చేసి, చితకబాదారు. ఇక పోలీసులకు సమాచారం అందడంతో మడికొండ పోలీస్ స్టేషన్ సీఐ అక్కడికి చేరుకున్నారు. యువతిని వరంగల్ లోని ఎంజీఎంకు తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు ప్రాణాపాయం లేదని తెలిపారు.మరో వైపు నిందితుడు శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.