సుజనా భూముల జాబితా మా దగ్గర ఉంది..
రాజధానిలో తప్ప భూముల ధర ఎక్కడా పెరగకూడదా?
2009లో వచ్చినట్లు వరద వస్తే రాజధాని పరిస్థితేంటి?
చంద్రబాబుపై మాకెలాంటి కక్ష లేదు
మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు
విజయవాడ: చొక్కాలు మార్చినట్టుగా పార్టీలు మారినవాళ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్ చేశారు. సీనియర్ నేతలు మరింత బాధ్యతగా మాట్లాడితే మంచిదని సుజనాచౌదరిని ఉద్దేశించి అన్నారు. రాజధాని భూముల్లో అనేక అక్రమాలు, భూ కుంభకోణాలు జరిగాయని బొత్స అన్నారు. టైమ్ తీసుకుని అన్నీ బయటకు తీస్తామని చెప్పారు. ‘‘రాజధానిలో ఎకరం కూడా తనకు లేదని ఎంపీ సుజనా చౌదరి అంటున్నారు. ఆయనకు ఎక్కడెక్కడ ఎనెన్ని భూములు వున్నాయో లిస్టు మాదగ్గర ఉంది. సుజనాకు మొత్తం 120 కంపెనీలు ఉన్నాయి. ఆయన కంపెనీకి చందర్లపాడు మండలం గుడిమెట్లలో 110 ఎకరాలు ఉన్నాయి. జగ్గయ్యపేటలో 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చి తర్వాత రాజధానిలో కలిపారు. యలమంచిలి రుషికన్య పేరుతోనూ భూములు ఉన్నాయి. ఎం.ఎస్.పి.రామారావు పేరుతో భూములు అప్పగించారు. ఇంట్లో వాళ్లకు ఎకరం రూ.వెయ్యి చొప్పున ఇచ్చుకోవడం గతంలో ఉందా? ల్యాండ్ పూలింగ్ కింద కొందరి పేర్లపై 25వేల చదరపు గజాల భూమి ఉంది. రాజధానిలో ఎవరికెన్ని భూములు ఉన్నాయో మొత్తం బయటపెడతాం’’ అని బొత్స లిస్టు చదివారు.
మరో అరగంట ఆగితే బాబు గారి ఇల్లు మునిగేది…
‘‘రాజధానికోసం కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చింది. శాసనసభ్యులు, మంత్రులు, న్యాయమూర్తుల క్వార్టర్స్ తప్ప అన్నీ తాత్కాలిక భవనాలే. టెండర్లు పిలిచినపుడు చంద్రబాబు విధానాలు పాటించలేదు. వరదనీటి నిర్వహణకు సాంకేతికత తెచ్చానని ఆయన చెప్పడం హాస్యాస్పదం. ముంపు వస్తుందని కాల్వల నిర్మాణం, లిఫ్ట్ పెట్టడం టెక్నాలజీనా? రాజధాని నిర్మాణంపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు పరిశీలించలేదు? ఆదరాబాదరాగా నారాయణ కమిటీని ఎందుకు వేశారు? హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుతున్నామని చంద్రబాబు అంటున్నారు. ప్రస్తుతం విజయవాడతో పాటు విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, కాకినాడ తదితర అనేక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. రాజధానిలో తప్ప భూముల ధర ఎక్కడా పెరగకూడదా? రాజధానిపై చంద్రబాబు విధానమేంటో స్పష్టంగా చెప్పాలి. ..’’ అని బొత్స చెప్పారు. ‘వరద సమయంలో ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాం. మరో అరగంటపాటు గేట్లు ఎత్తకపోయివుంటే చంద్రబాబు ఇల్లు మునిగిపోయేది. ఆయనపై మాకెలాంటి కక్ష లేదు. పెయిడ్ ఆర్టిస్టుల్ని పెట్టి ప్రభుత్వంపై బురద చల్లారు. 2009లో వచ్చినట్లు వరద వస్తే రాజధాని పరిస్థితేంటి?’ అని బొత్స ప్రశ్నించారు.