ఏపీలో పీఆర్సీ వివాదం రోజురోజుకి మరింత ముదురుతోంది. ఉద్యోగులు, ప్రభుత్వం చెరోదారిన నడుస్తున్నాయి. ప్రభుత్వం చర్చకు రావాలని మంత్రులతో కూడిని కమిటి వేస్తే.. తమ డిమాండ్లను పరిష్కరిస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగులు తెగేసి చెబుతున్నారు. దీంతో ఈ అంశంపై ప్రతిష్టంభన నెలకొంది.
ప్రభుత్వం పాజిటివ్ మైండ్ తో ఉన్నపుడు ఉద్యోగ సంఘాలు చర్చలకు వస్తే మంచిదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబసభ్యులు ఈ విషయంలో కాస్త ఆలోచించాలని సూచించారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు ప్రతీరోజు ప్రయత్నిస్తున్నా.. వారు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.
ఈ విషయాన్ని రాజకీయంగా చూడకుండా ఉంటే మంచిదని హితవు పిలికారు. కానీ.. రాజకీయ ఆలోచనతో ఉద్యోగ సంఘాలు ఇలా వ్యవహరిస్తున్నాయా అనే అనుమానాన్ని బొత్స వ్యక్తం చేశారు. ఉద్యోగుల విషయంలో అవసరమైతే నాలుగు మెట్లు దిగుతామని సజ్జల చెప్పడాన్ని అలసత్వంగా తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. శుక్రవారం వరకు ఉద్యోగులతో చర్చించేందుకు మంత్రుల కమిటీ ఎదురు చూసింది. వారు రాకపోవడంతో మంత్రుల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలాగే వ్యవహరిస్తే.. చట్టం ప్రకారం ఎలా జరగాల్సింది.. అలా జరుగుతుందని బొత్స హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలుకు ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రుల కమిటీగా తాము ప్రతిరోజు వస్తున్నా..ఉద్యోగ సంఘాల నేతలు రావడం లేదని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు వచ్చారని.. వారితో చర్చలు జరిపామని చెప్పారు. ఇదొక మంచి పరిణామమని సజ్జల తెలిపారు.