వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్తున్న నలుగురి పేర్లను ప్రకటించారు. విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించగా.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావును అభ్యర్థులుగా ఖరారు చేశారు సీఎం జగన్.
ముందుగా నలుగురితో కాసేపు సమావేశమయ్యారు. భేటీ అనంతరం వారి పేర్లను అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో పలుమార్లు ముఖ్యనేతలతో జగన్ చర్చించి పేర్లను ఖరారు చేశారని తెలిపారు.
నలుగురు రాజ్యసభ అభ్యర్థుల్లో ఇద్దరు బీసీలేనని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రత్యక్ష పోస్టులైనా, నామినేటెడ్ పోస్టులైనా తమది ఒకేటే దారని అన్నారు. జనాభా దామాషాకు తగ్గట్టుగా బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్నామని వివరించారు.
అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఇక నలుగురు అభ్యర్థులు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియజేశారు.