విజయవాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్‌రెడ్డి మాయలో పడ్డానో లేదో కానీ.. చిత్తశుద్ధి ఉన్న సీఎం నాయకత్వంలో పనిచేస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. రెండు మెట్లు దిగి వైసీపీలో చేరుతున్నానని ఆనాడే చెప్పానని అన్నారు. తమ పార్టీకి కాల మహిమ వల్ల 151 సీట్లు రాలేదని, చిత్తశుద్ధి ఉందనే ప్రజలు జగన్‌ను ఎన్నుకున్నారన్నారు. ఫోక్స్ వ్యాగన్ కేసులో నన్ను సాక్షిగానే పిలిచారని బొత్స తెలిపారు. పవన్ తీరు అవినీతిని పోత్సహించేలా ఉందని విమర్శించారు. అమరావతిలో భూ దోపిడీని సహించనని పవన్ అనలేదా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఆర్థిక లావాదేవీలకు పవన్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు ఇల్లు, పవన్‌కు స్థలం ఇచ్చింది ఒకే వ్యక్తి కాదా? అని మంత్రి బొత్స ప్రశ్నించారు. రాజధానిలో టీడీపీ అక్రమాల గురించి గతంలో పవనే చెప్పారని బొత్స అన్నారు. అమరావతిలో అభివృద్ధి పేరుతో దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణంలోనూ అవినీతి జరిగిందన్నారు. అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స స్పష్టం చేశారు