తమిళనాడు రాష్ట్రంలో మళ్లీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్నాడీఎంకే ఏకనాయకత్వం కావాలనే డిమాండ్ వినిపిస్తోంది. అన్నాడీఎంకేలో అధికార పగ్గాలపై గురువారం చెన్నైలో కీలక సమావేశం జరిగింది. ఒక్క నేత ఆధ్వర్యంలోనే పార్టీ ముందుకెళ్లాలని నిర్ణయించినందున.. జనరల్ కౌన్సిల్ మీటింగ్ కీలకంగా మారింది. మాజీ సీఎం, పార్టీ కో-ఆర్డినేటర్ పళనిస్వామి, అలాగే పార్టీ కోఆర్డినేటర్ పన్నీర్ సెల్వం మధ్య గ్రూప్ వార్ తలెత్తింది.
పార్టీని చేజిక్కించుకునేందుకు సీనియర్ నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేశారు. ఏక నాయకత్వం విషయంలో ఎక్కువ మంది పళనిస్వామి వైపే మొగ్గు చూపారు. మాజీ మంత్రులు, ముఖ్య నేతలు రెండుగా విడిపోయారు. ఓపీఎస్, ఈపీఎస్ మద్దతుదారులు ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకున్నారు. దీంతో సమావేశం మధ్యలోనే పార్టీ సమన్వయకర్త పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో వాకౌట్ చేశారు. ఈ సమయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
సమావేశం నుంచి బయటకు వెళుతున్న పన్నీర్ సెల్వంపై కొందరు దాడికి యత్నించారు. ఆయనపై పళని స్వామి మద్దతుదారులు వాటర్ బాటిళ్లను విసిరేశారు. అంతేకాదు, పన్నీర్ సెల్వం కారులో గాలి తీసివేశారు.
ఈ గందరగోళం మధ్య జనరల్ కౌన్సిల్ ప్రతిపాదించిన 23 తీర్మానాలను తిరస్కరించడం జరిగింది. పార్టీకి ఒకే నాయకత్వ వ్యవస్థను తిరిగి తీసుకురావడానికి ముందుగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై చర్చించేందుకు మళ్లీ జూలై 11వ తేదీన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం కానుంది. అదే రోజున కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.