ఈ కాలంలో ఎవరిని నమ్మాలో, నమ్మకూడదో తెలియడం లేదు. మనోడే కదా అని నమ్మితే తెలిసినవాళ్లే నట్టేట ముంచేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో ఓచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. బోయిన్ పల్లి కిడ్నాప్ స్టోరీ కూడా కాస్త అటూఇటూగా అలాగే ఉంది.
హైదరాబాద్ బోయిన్ పల్లిలో ఉండే వ్యాపారి మనోజ్ జైన్ కుమార్తెను ఈనెల 10న కిడ్నాప్ చేసేందుకు చూసింది ఓ ముఠా. పైగా మనోజ్ కు ఫోన్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేసింది. పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని కిడ్నాపర్లను గుర్తించి పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన జవారీ లాల్ బాచుపల్లిలో ఐరన్ వ్యాపారం చేస్తున్నాడు. అతని తండ్రి రమేష్ కు మనోజ్ జైన్ బాగా తెలుసు. తన కుమారుడు అక్కడే ఉన్నాడు.. ఎప్పుడైనా ఓసారి మాట్లాడండి అని చెబుతుండేవాడు. జవారీలాల్ వ్యాపారంలో నష్టాలు మొదలయి డబ్బున్న పిల్లలను కిడ్నాప్ చేయాలని పథకం పన్నాడు.
జోధ్ పూర్ లో ఉండే తన స్నేహితుడు మహేంద్ర సింగ్ ను నగరానికి రప్పించాడు జవారీలాల్. పక్కా ప్లాన్ తో మనోజ్ ఇంటి పరిసరాల్లో ఈనెల 8, 9న రెక్కీ చేశాడు. 10న మనోజ్ కుమార్తెను కిడ్నాప్ చేయాలని చూశాడు. రెండు బైక్స్ తో ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ లు, మంకీ క్యాప్ లు పెట్టుకుని వెళ్లారు నిందితులు. బాలిక ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో లోపలికి వెళ్లగా.. వారిని చూసి కేకలు వేయడంతో పారిపోయారు. తర్వాత ఇంటర్నెట్ ఫోన్ ద్వారా మనోజ్ కు కాల్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే మీ కుమార్తెను చంపేస్తామని బెదిరించారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్లను పట్టుకున్నారు.