ఆగస్ట్ 30వ తేదీన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ “సాహో” ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఒక్కసారి సాహో విడుదలయ్యిందంటే బాక్సాఫీస్ దగ్గర వేరే ఏ సినిమాకూ కలెక్షన్స్ షేర్ చేసుకునే అవకాశం కనీసం ఒక రెండు వారాల వరకూ ఉండకపోవచ్చు అనేది సినీ విశ్లేషకుల అంచనా. ఆ మాత్రం చెయ్యకపోతే సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమాకు ఆశించినంతగా లాభాలు ముట్టకపోవచ్చు అనుకుంటున్నారు.
అందుకే సాహో విడుదలకు ముందున్న ఒకే ఒక్క అవకాశంగా ఆగస్ట్ 23ను వాడుకుంటున్నారు చిన్న సినిమా నిర్మాతలు. ఆ డేట్ మిస్సయితే మళ్ళీ దాదాపుగా మూడు వారాలు వెయిట్ చెయ్యాల్సిందే, థియేటర్లు దొరకడం కూడా గగనం. అందుకే ఈ శుక్రవారం, ఆగస్ట్ 23వ తేదీన వరుసపెట్టి పది సినిమాలు విడుదలకు సిద్ధమయిపోయాయ్. మూడు వారాలు ఆగడం కంటే ఈ ఏడు రోజుల్లో ఎంతో కొంత ఆడే అవకాశాన్ని వదులుకోకూడదని అంతా డిసైడ్ అయినట్టున్నారు.
ఆ పది సినిమాల జాబితా పరిశీలిస్తే తమిళంలీ సూపర్ హిట్ అయిన ‘కణ” తెలుగు రీమేక్‌గా కే.యస్.రామారావు నిర్మాణంలో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “కౌసల్యా కృష్ణమూర్తి” సినిమా ఒక్కటే తెలుగు ప్రేక్షకులకు కొద్దో గొప్పో తెలిసిన తారాబలం ఉన్న సినిమా. ఐశ్వర్యా రాజేష్, రాజేంద్ర ప్రసాద్, ఝాన్సీ, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని నిర్మాతలు నమ్ముతున్నారు.
ఈ సినిమాతో పాటుగా హవా, ఏదైనా జరగచ్చు, జిందా గ్యాంగ్, బాయ్, ఉండిపోరాదే, నీతోనే హాయ్ హాయ్, కనులు కనులను దోచేనే, నివాసీ, నేనే కేడీ నెం 1 సినిమాలు బాక్సాఫీస్ ముందుకొచ్చాయ్. ఈ తొమ్మిదింటిలో కూడా కాసింత ప్రమోషన్ వల్ల జనాలకు తెలిసిన సినిమాలు హవా, ఏదైనా జరగచ్చు. చూద్దాం ఎవరి లక్కు ఎంత వరకూ ఉందో.