ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతిలో కిడ్నాప్ కలకలం రేపుతోంది. తిరుపతికి చెందిన ఐదేళ్ల బాలుడిని గుర్తుతెలియని మహిళ అపహరించింది. తిరుపతి సమీపంలోని దామినేడుకు చెందిన మహిళ తిరుమలలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమెకు ఐదేళ్ల గోవర్దన్ రాయల్ అనే కుమారుడు ఉన్నాడు. అతను శ్రీవారి ఆలయం ఎదుట ఆడుకుంటూ కనింపించకుండాపోయాడు.
దీంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు బాలుడి ఆచూకీ కోసం చుట్టుపక్కల గాలించారు. ఎలాంటి ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.
సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసినట్టుగా గుర్తించారు. ఆ మహిళ బాలుడిని కిడ్నాప్ చేసిన తర్వాత ఆర్టీసీ బస్సులో తిరుపతికి చేరుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
అక్కడి నుంచి ఆమె ఎక్కడికి వెళ్లిందో గుర్తించేందుకు విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యల్లో భాగంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. త్వరలోనే బాలుడిని ఆచూకీ కనిపెడతామని తెలిపారు పోలీసులు.