చిన్న పిల్లలకు ఫోన్లు, ట్యాబ్లెట్లను ఇంటర్నెట్ కనెక్షన్‌తో సహా ఇస్తే ఏం జరుగుతుందో ఈ సంఘటన మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఓ ఆరేళ్ల బాలుడు ఐప్యాడ్‌లో గేమ్స్ ఆడుతూ వాటిలో కంటెంట్ కోసం తన తల్లి బ్యాంక్ అకౌంట్ నుంచి ఏకంగా 16వేల డాలర్లు (దాదాపుగా రూ.11 లక్షలు) ఖర్చు చేశాడు. విషయం తెలుసుకున్న ఆమె ఇప్పుడు లబోదిబోమంటోంది.
అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన జెస్సికా జాన్సన్ అనే మహిళకు 6 ఏళ్ల కుమారుడు జార్జ్ జాన్సన్ ఉన్నాడు. అతను ఐప్యాడ్‌లో గేమ్స్ ఆడుతుంటాడు. అయితే వాటిలో అందించే ప్రీమియం ఐటమ్స్ ను డబ్బుతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో అతను తన తల్లి బ్యాంక్ అకౌంట్ నుంచి విడతల వారీగా గేమ్‌లలో ఐటమ్స్‌ను కొనుగోలు చేశాడు. కాగా ఒకే రోజు ఏకంగా 2500 డాలర్లు (దాదాపుగా రూ.1.80 లక్షలు) ఉపయోగించి గేమ్స్‌లో ఐటమ్స్‌ను కొన్నాడు. దీంతో అనుమానం వచ్చిన జెస్సికా తన అకౌంట్‌లో ఫ్రాడ్ జరిగిందని భావించి బ్యాంక్‌కు ఫిర్యాదు చేసింది. అయితే అకౌంట్‌లో ఎలాంటి ఫ్రాడ్ జరగలేదని, ఐప్యాడ్‌లో ఉన్న ఆమె అకౌంట్ నుంచే చెల్లింపులు జరిగాయని గుర్తించారు. దీంతో ఆమెకు మొత్తం విషయం అర్థమైంది.
అయితే సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్‌ను ఆమె రీఫండ్ ఇప్పించాలని కోరింది. కానీ వారు నిరాకరించారు. సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు 60 రోజుల లోగా చెబితేనే వారు రీఫండ్ ఇస్తారు. కానీ జెస్సికా విషయంలో సమయం మించిపోయింది. దీంతో వారు రీఫండ్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. అయితే ఐప్యాడ్‌లో పేరెంట్ కంట్రోల్స్ ఉంటాయని, వాటిని ఆన్ చేసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగవని, పిల్లలు యాప్‌లలో కొనుగోళ్లు జరిపేందుకు వీలు కాదని, అలాగే ఐప్యాడ్ ను ఉపయోగించే విషయంలోనూ నియంత్రణలు ఉంటాయని, కనుక ఆ కంట్రోల్స్‌ను యాక్టివేట్ చేసుకోవాలని ఆమెకు యాపిల్ సలహా ఇచ్చింది. అయితే ఆ విషయం తనకు తెలియదని, తెలిసి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదని ఆమె విలపిస్తోంది.
ఇక మార్చిలో ఆమె చివరిసారిగా వేతనం అందుకుంది. ఆ తరువాత కరోనా వల్ల వేతనం సరిగ్గా అందడం లేదు. అందినా ఆమె జీతంలో 80 శాతం కోత విధిస్తున్నారు. కాగా ఆ మొత్తంతో ఆమె తన ఇంటి లోన్ చెల్లించాలని అనుకుంది. కానీ ఇప్పుడు డబ్బంతా అలా నష్టపోయే సరికి ఆమెకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.