బోరు బావులు చిన్నారుల పాలిట మృత్యు పాశాలుగా మారుతున్నాయి. గతంలో బోరు బావిలో పడి చిన్నారులు మరణించిన ఘటనలు ఎన్నో జరిగాయి. ఈ క్రమంలో నీళ్లు లేని బోరుబావులను పూడ్చివేయాలని ప్రభుత్వాలు, అధికారులు హెచ్చరించినా ప్రజల్లో మార్పు రావడం లేదు.
తాజాగా మధ్యప్రదేశ్‌లో ఎనిమిదేండ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. బెతుల్ జిల్లాలోని మండవి గ్రామంలో ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు సాయంత్రం 5గంటలకు బోరుబావిలో పడిపోయాడు.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలను చేపట్టారు. బోరుబావిలో 60 అడుగుల వద్ద బాలుడు తన్మయ్ ఇరుక్కు పోయినట్టు అధికారులు గుర్తించారు. వెంటనే బాలుడికి ఊపిరి అందేందుకు ఆక్సిజన్ పైపులను పంపించారు.
ప్రొక్లెయిన్ యంత్రాలు, ట్రాక్టర్లను ఘటనా స్థలానికి అధికారులు రప్పించారు. బోరుబావి చుట్టూ మట్టిని తవ్వుతున్నారు. బాలుడి చేతిని తాడుతో కట్టి బయటకు లాగేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో సుమారు 12 అడుగుల వరకు బాలుడు పైకి వచ్చాడు.
కానీ ఆ తర్వాత తాడు తెగిపోయింది. దీంతో బాలున్ని బయటకు తీసేందుకు మరో మార్గంలో అధికారులు ప్రయత్నిస్తున్నారు. బోరుబావిలో ఇరుక్కున్న బాలుడితో అతని తండ్రి మాట్లాడాడు. లోపల చీకటిగా ఉందని, తనకు చాలా భయం వేస్తోందంటూ తండ్రికి తెలిపాడు. కొద్దిసేపటి తర్వాత బాలుడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.