అసలే బాలీవుడ్ సినిమాలు పెద్దగా ఆడడం లేదు. భూల్ బులయా-2 తప్పితే మిగతా సినిమాలన్నీ వచ్చినవి వచ్చినట్టే ఫ్లాప్ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో అమీర్ ఖాన్ మూవీ వస్తోంది. అమీర్ మూవీ అంటే హంగామా మామూలుగా ఉండదు. ఈసారి కచ్చితంగా బాలీవుడ్ కు కళ వస్తుందని అంతా ఆశించారు. కానీ, ఆశ్చర్యకరంగా సోషల్ మీడియాలో సినిమాపై నెగెటివ్ ప్రచారం జరుగుతోంది.
బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే వారం థియేటర్లలోకి రాబోతున్న అమీర్ సినిమాను ఎవ్వరూ చూడొద్దంటూ తెగ పోస్టులు పడుతున్నారు. దీనికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా రెండు మాత్రం తెరపైకొచ్చాయి.
గతంలో అమీర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని సరిగ్గా విడుదలకు ముందు తెరపైకి తెచ్చారు నెటిజన్లు. శివలింగంపై పాలు అభిషేకం చేసేకంటే, పేదలకు ఇస్తే మంచిదంటూ గతంలో అమీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అటు హీరోయిన్ కరీనా కపూర్ కూడా థియేటర్లకు వస్తే రండి, లేకపోతే పొండి అనే అర్థం వచ్చేలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
వీరిద్దరి వ్యాఖ్యల ప్రభావం లాల్ సింగ్ చడ్డాపై గట్టిగా పడినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాపై పాజిటివ్ గా ఎన్ని కామెంట్స్ పడుతున్నాయో, నెగెటివ్ గా కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. అమీర్ సినిమా కచ్చితంగా విలక్షణంగా ఉంటుంది. అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ కంటెంట్ ను ఉత్తరాది జనాలు ఏ స్థాయిలో ఆదరిస్తారో చూడాలి.