పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ దుర్మార్గుడు. అతడికి ఇదివరకే పెళ్లి అయింది. కానీ తన మాజీ ప్రేమికురాలిని పెళ్లి చేసుకోవాలని ఆమెను బలవంత పెట్టాడు. అందుకు నిరాకరించిందని యువతిపై పెట్రోల్ పోసి, నిప్పంటించాడు. ఈ ఘటన ఝార్ఖండ్ లోని డుమ్కాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. డుమ్కాలోని బాల్కీ గ్రామానికి చెందిన ఓ యువతికి మహేశ్ పూర్ కు చెందిన రాజేష్ తో 2019లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత మూడేళ్లుగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. కట్ చేస్తే 2022 లో రాజేష్ కు మరొకరితో పెళ్లి జరిగింది. దీంతో యూవతి కూడా వేరే పెళ్లికి సిద్ధమయ్యింది. కానీ రాజేష్ మాత్రం తననే పెళ్లి చేసుకుంటానని యువతి వెంటపడ్డాడు.
యువతి ఎంత చెప్పినా వినలేదు. పైగా తనను పెళ్లి చేసుకోపోతే ఆమెను చంపుతానని బెదిరించాడు. చివరికి అన్నంత పనికి ఒడుగట్టాడు ఆ దుర్మార్గుడు. శుక్రవారం ఉదయం ఎవరూ లేని సమయం చూసుకుని రాజేష్ యువతి ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులు బద్దలకొట్టుకుని వెళ్లి అప్పటికే పడుకుని ఉన్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన యువతిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించాలని సూచించారు. నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.