ప్రేమించడం అంటే ఒకరి కోసం ఒకరు బతకడం. ప్రేమను పెద్దలు ఒప్పుకొకపోతే త్యాగానికి సిద్ధపడడం లాంటివి మనం కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం.ఇంకొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకోవడం కూడా చూస్తూనే ఉంటాం. మరికొన్ని సందర్భాల్లో వికృత పోకడలకు పోయి ప్రేమించిన అమ్మాయినే చంపేయడం చూస్తూంటాం. కానీ ఇక్కడ ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి అవుతుందని తెలిసి పెట్రోలు పోసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన తాజాగా హైదరాబాద్ లోని లంగర్‌హౌజ్ లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…రాజేంద్ర నగర్ కు చెందిన అశ్వక్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి కూడా అశ్వక్ ను ఇష్టపడింది.యువతి కుటుంబంలో ఈ విషయం తెలిసి యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. అయినప్పటికీ ఇరువురు కూడా పెళ్లిని ఆపడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
దాంతో చేసేదేమి లేక యువతి పెళ్లికి సిద్ధమైంది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన అశ్వక్ పెళ్లి మండపం ముందు పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని మండపంలోనికి వెళ్లాడు.అక్కడే ఉన్న పెళ్లి కూతుర్ని హత్తుకోవాలని చూడగా బంధువులు కొందరు ఆమెను దూరంగా లాగారు. మంటలు అదుపు చేసి స్థానిక ఆస్పత్రికి తరలించగా మూడు రోజులు మృత్యువుతో పోరాడి యువకుడు సోమవారం చనిపోయాడు. వధువు బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.