జబర్దస్త్ పుణ్యమా అని ఫేమస్ అయిన వారిలో రచ్చ రవి కూడా ఒకరు. తన మార్క్ డైలాగులతో తన స్థాయికి తగిన విధంగా ప్రేక్షకులను అలరించారు అనే చెప్పాలి. తాజాగా ఆయన బ్రహ్మానందం గొప్పతనం గురించి పలు వ్యాఖ్యలు చేసారు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన కారణం కూడా చెప్పారు. అందరూ అనుకున్నట్టు తనకు మల్లెమాల వారితో ఏ విధమైనటువంటి మనస్పర్ధలు లేవని స్పష్టం చేసాడు.
జబర్దస్త్ కార్యక్రమం తనకు ఒక తల్లి లాంటిదన్న ఆయన… జబర్దస్త్ లో ఉండగా తనకు సినిమా అవకాశాలు రావడంతో రెండింటిని మేనేజ్ చేయలేక జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యానని పేర్కొన్నాడు. జబర్దస్త్ కార్యక్రమంలో తను వేసే స్కిట్లు చూసిన బ్రహ్మానందం గారు తనను పిలిచి మరీ తన కామెడీను మెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నాడు. టీవీలలో ఇలా ఒకసారి బ్రహ్మానందం గారితో మాట్లాడుతూ మాటల మధ్యలో తనకు ఇల్లు కొనుక్కోవడమే కల అని చెప్పినట్టు పేర్కొన్నాడు.
అయితే నేను చెప్పిన ఈ మాటలు విన్న బ్రహ్మానందం గారు ఒక ఫ్లాట్ ఉందని… ఐదు లక్షల తక్కువైనా పర్వాలేదు వెళ్లికొనుక్కో డబ్బు నేను ఇస్తానని చెప్పారని… తనకు ఎవరి దగ్గర డబ్బు తీసుకోవడం ఇష్టం లేకపోయినా బ్రహ్మానందం గారు చెప్పడంతో వెళ్లి ఫ్లాట్ కొన్నానని వివరించారు. ఇలా తాను ఇల్లు కొనడానికి బ్రహ్మానందం గారు చాలా సహాయం చేశారని తెలిపాడు. తన గృహప్రవేశానికి కూడా బ్రహ్మానందం గారు వచ్చి తమను ఆశీర్వదించారన్నాడు రవి.