శ్రీశైలంలోని ప్రముఖ శైవ క్షేత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో నేటి నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 11 రోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగనున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరించనున్నారు.
ఈ సందర్భంగా మొదటిసారి స్వామి వార్లకు పట్టువస్త్రాలు శ్రీకాళహస్తి దేవస్థానం సమర్పించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. అందులో భాగంగా నేటి నుండి భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనం లభించనుంది. మార్చి 5 నుంచి సర్వ దర్శనాలు పునఃప్రారంభమవుతాయని ఆలయ అధికారులు తెలిపారు.
కాగా.. మహాశివరాత్రికి, బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులు, దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్ధం అధికారులు ఆన్‌లైన్లో టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ఈవో లవన్న సూచించారు. శీఘ్రదర్శనం రూ. 200, రూ.500 అతిశీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
శీఘ్ర దర్శనం టికెట్లు రోజుకు ఐదు వేలు అందుబాటులో ఉండగా.. అతి శీఘ్ర దర్శనం టికెట్లు రెండు వేలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. బుధవారం నుండి స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 1న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రుద్రాభిషేకం, లింగోద్భవం, రాత్రి పాగాలంకరణ, కల్యాణోత్సవం, 2న రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహించనున్నట్టు లవన్న ప్రకటించారు.