కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసిన అర్చకులు.. ఆదివారం ఉదయం అంగరంగవైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మత్రోచ్చరణల నడుమ వైభవోపేతంగా వేడుక సాగింది. కేరళా వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి.
శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం వేడుకలను ఘనంగా జరిపారు అధికారులు. సాయంత్రం స్వామివారు శేషవాహనం పై ఊరేగనున్నారు. రాత్రి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విష్వక్సేన పూజ, కలశ ప్రతిష్ట, కలశపూజ నిర్వహించారు. సీతా, రామ, లక్ష్మణ స్వామివార్లకు కంకణధారణ చేసి పుట్టమట్టిని సేకరించి అంకురార్పణ చేసారు అర్చకులు.
నేటినుండి ఈనెల 19 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహించగా.. ఈ ఏడాది కోవిడ్ వ్యాప్తి అదుపులోకి రావడంతో ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ఉత్సవాల్లో భాగంగా.. ఈ నెల 15న పున్నమి వెన్నెలలో సీతారాముల కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. పౌర్ణమి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటలలోపు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నామన్నారు. సీతారాములకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నట్టు వెల్లడించారు నిర్వాహకులు.