బ్రెజిల్ సాకర్ దిగ్గజం స్టార్ ప్లేయర్ పీలే కన్ను మూశారు. ఆయన వయస్సు 82 ఏళ్ళు.. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన.. సావో పాలో లోని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సుమారు నెల రోజులుగా పీలే ఆసుపత్రిలో చికిత్స పొందారు.
తన 21 ఏళ్ళ కెరీర్ లోనే పీలే తన దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు. బ్రెజిల్ కి మూడు సార్లు.. 1958, 1962, 1970 లలో ఫిఫా ప్రపంచ కప్ ను అందించారు. తన దేశం తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్ లలో 77 గోల్స్ చేసిన పీలే.. 1363 మ్యాచ్ లలో 1281 గోల్స్ చేసి ఫుట్ బాల్ అభిమానులకు కనువిందు చేశారు.
2000 సంవత్సరంలో ‘ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ’ గా ఎంపికైన పీలే.. 1971 లో బ్రెజిల్ జాతీయ జట్టు నుంచి రిటైరయ్యారు. ఆయన మృతితో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్ బాల్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
పీలే మృతికి ఆర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సి.. ఇంకా రోనాల్డో నివాళులర్పించారు. పీలే లేని లోటు తీర్చలేనిదన్నారు. ఓ అవార్డుల కార్యక్రమంలో తాను, పీలే కలిసి ఉన్న ఫోటోను మెస్సి ట్వీట్ చేశారు. పీలే ని ‘కింగ్ ఆఫ్ ఫుట్ బాల్’ గా మెస్సి, రోనాల్డో అభివర్ణించారు. వీరితో బాటు నేమర్, కిలియన్ ముబాపే వంటి ఫుట్ బాల్ క్రీడాకారులు.. పీలే మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్ చేశారు.