రాజస్థాన్‌లోని జోద్‌పూర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. దేచు పోలీసు స్టేషన్ పరిధిలోని లోడ్తా గ్రామంలో నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
12 మంది సభ్యులతో కూడిన ఓ హిందూ కుటుంబం పాకిస్తాన్ నుంచి.. కొన్నేళ్ల క్రితం రాజస్థాన్‌కు వలస వచ్చింది. లోడ్తా గ్రామంలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకొని వారంతా వ్యవసాయం చేస్తున్నారు. అయితే రాత్రికి రాత్రే ఏమైందో తెలియదు కానీ.. కుటుంబంలోకి 11 మంది ఒకేసారి విషం తాగారు. అయితే ఆ సమయంలో బయటపడుకున్న వ్యక్తి ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. లోపల ఏం జరిగి ఉంటుంతో తనకూ తెలియదని అతడు చెప్తున్నాడు.
ఆ హిందూ కుటుంబం నివాసముంటున్న గుడిసె పరిసర ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలించిన పోలీసులకు.. ఎలాంటి క్లూలు దొరకలేదు. మృతదేహాల పక్కన విషం డబ్బా మాత్రమే కనుగొన్నారు. అలాగే వారి శరీరాలపై కూడా ఎలాంటి గాయలు లేవని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒకేసారి ఇలా 11 మంది సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం మిస్టరీగా మారింది.