అంబర్ పేట్ లో కుక్కల దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనాన్ని సృష్టించింది. అయితే ఈ ఘటన మర్చిపోక ముందే మరోసారి హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. చైతన్య పురి ప్రాంతంలో చిన్నారిపై దాడి చేశాయి.
అయితే అదృష్టవశాత్తు ఈ దాడిలో ఆ బాలుడు స్వల్పగాయాలతో బతికి బయటపడ్డాడు. చైతన్యపురి మారుతీనగర్ కాలనీలో నాలుగేళ్ల రిషి ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. అయితే సకాలంలో రిషి కేకలు విని.. కుటుంబ సభ్యులు, స్థానికులు పరుగున వచ్చి కుక్కలను తరిమి కొట్టారు.
ఇక ఈ దాడిలో అప్పటికే కుక్కలు రిషి వీపు, కాళ్లు, చేతులపై గాయాలు చేశాయి. అయితే కాలనీలో వీధి కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉందని.. ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
ఇలా ఉంటే.. కరీంనగర్ లో కుక్కలు విద్యార్థి పై దాడి చేసాయి. శంకరపట్నంలో ఉన్న ఎస్ సీ హాస్టల్లోకి చొరబడ్డ కుక్కలు సుమంత్ అనే విద్యార్థిపై విరుచుకుపడ్డాయి. ఈ సంఘటనలో సుమంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని.. పిల్లలు, వృద్ధులు ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి జంకుతున్నారని.. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు చెబుతున్నారు.