మరో మెడికో ఆత్మహత్య కలకలం రేపుతోంది. వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగానే.. తాజాగా మరో మెడికో ఆత్మహత్యకు పాల్పడడం ఆందోళనను కల్గిస్తోంది.
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దాసరి హర్ష తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. హర్ష శుక్రవారం రాత్రి తోటి విద్యార్థులతో సరదాగానే ఉన్నాడని.. డిన్నర్ చేసిన తర్వాత తన గదిలోకి వెళ్లి అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి 1 టౌన్ పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. కాగా దాసరి హర్ష స్వస్థలం మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం చింతగూడ గ్రామం. ఇక అతడి తండ్రి శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉండగా.. తల్లి గృహిణి. అయితే వరుస మెడికో ఆత్మహత్యలు రాష్ట్రంలో కలకలాన్ని రేపుతున్నాయి.