మహబూబాబాద్ జిల్లా కస్తూర్భ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయింది. రాత్రి నుంచి ఇప్పటి వరకు 43 మంది విద్యార్థినీలు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వారందర్ని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ పట్టణంలోని కస్తూర్భా గాంధీ విద్యాలయంలో నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ అయింది. రాత్రి టమాటా కర్రితో భోజనం చేసిన విద్యార్థినీలు ఉదయం అస్వస్థతకు గురయ్యారు. 15 మందికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. అయితే ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విద్యార్థినీలు ఆరోపిస్తున్నారు.
ఇక వాంతులు, విరోచనాలతో విద్యార్థినీల ఆరోగ్య పరిస్థితి చెయ్యి దాటుతుండడంతో విషయాన్ని బయటకు రానీయకుండా.. డాక్టర్లనే పాఠశాలకే పిలిపించింది యాజమాన్యం. సీక్రెట్ గా బాధిత విద్యార్థినులకు వైద్యం అందించే ప్రయత్నం చేసింది. అయితే ఈ విషయం కాస్త బయటకు రావడంతో పాటు విద్యార్థినీలకు వాంతులు, విరోచనాలు అధికం కావడంతో.. తప్పని పరిస్థితుల్లో వారిని హుటాహుటిన రెండు కార్లలో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే కొంత మంది విద్యార్థినీలు కడుపు నొప్పి భరించలేక అవస్థలు పడుతుంటే..మరి కొంత మందికి వెంటిలేటర్ పై శ్వాస అందిస్తున్నారు. ఇక ఇలా ఉంటే.. విద్యార్ధినీల తల్లిదండ్రులకు ఇప్పటి వరకు పాఠశాల యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు.
మరో వైపు ఈ సంఘటనపై పలు విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. చికిత్స పొందుతున్న విద్యార్థినీలను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు,మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.