పేపర్ల లీకేజీ వ్యవహారంతో టీఎస్పీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ కారణంగా ఇప్పటికే పలు పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్.. తాజాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో ప్రిలిమ్స్ రాసిన 2.86 లక్షల మంది అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. కాగా, ప్రిలిమ్స్ ఫైనల్ కీ ని జనవరి 13న కమిషన్ రిలీజ్ చేయగా.. ఇందులో 25,050 మంది అర్హత సాధించారు. వీరంతా జూన్ లో మెయిన్స్ పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు.
ఈ పరిస్థితిలో కమిషన్ వాటిని రద్దు చేసి మరోసారి జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా జూనియర్ లెక్చరర్ పరీక్షను కూడా అధికారులు వాయిదా వేశారు. దీంతో ఎగ్జామ్ పేపర్ లీకేజీ వ్యవహారంలో మొత్తం మూడు పరీక్షలను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ.
ఈ వ్యవహారంలో సిట్ అంతర్గత విచారణలోనూ ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టు నిర్ధారించడం జరిగింది. దీంతో ఏఈ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్ తాజాగా మరో రెండు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డీఏవో, ఏఈఈ పరీక్షలను కూడా రద్దు చేసింది.అయితే రద్దు చేసిన పరీక్షలకు త్వరలోనే మరో కొత్త తేదీని ప్రకటిస్తామని బోర్డు వెల్లడించింది. అభ్యర్థులు ఆందోళన చెందొద్దని సూచించింది.