దేవుడి గుడికే కన్నం వేశారు దోపిడీ దొంగలు. అర్థరాత్రి ఆలయంలోకి చొరబడి బీభత్సం సృష్టించారు. రాత్రి స్వామి వారి పవళింపు సేవ అనంతరం గుడి ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి వెళ్లిపోయారు అర్చకులు. శుక్రవారం తెల్లవారు జామున ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ చేసేందుకు గుడికి వెళ్లిన అర్చకులు ప్రధాన ద్వారం నుండి లోపలకు అగంతకులు చొరబడినట్టుగా గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో… రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
అయితే ఇదంతా జరిగింది.. ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న చిన్న గుడిలోనో కాదు. ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో. అర్థరాత్రి ప్రధాన ద్వారం గుండా లోపలికి ప్రవేశించిన దోపిడీ దొంగలు ప్రధాన ఆలయంలో బంగారు నగలతో పాటు కొన్ని విగ్రహాలు, అనుబంధ ఆలయాల్లోని విగ్రహాలను ఎత్తుకెళ్లారు.
అయితే పోలీసులు పూర్తిగా ఆరా తీసే పనిలో నిమగ్నం కావడంతో పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఇక కొండగట్టు అంజన్న క్షేత్రంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని ఫుటేజీ ఆధారంగా అనుమానితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
మరో వైపు క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దింపాలని పోలీసు అధికారులు యోచిస్తున్నారు. అయితే అంతరాష్ట్రీయ దొంగల ముఠా పనే అయి ఉంటుందని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏది ఏమైనా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంలోనే ఇలా దొంగతనం జరగడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి