సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం జరగడంతో పాటు పలువురు గాయపడడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించినవారికి 3 లక్షల ఎక్స్ గ్రేషియాను కేసీఆర్ ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సీఎం కేసీఆర్ సూచించారు. కాగా..సికింద్రాబాద్‌లో గురువారం రాత్రి స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
మృతుల్ని ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్‌గా గుర్తించారు. వీరిలో వరంగల్‌కు చెందిన ముగ్గురు, ఇద్దరు మహబూబాబాద్ వాసులు, ఖమ్మంకు చెందిన ఒకరు ఉన్నారు.అయితే ఈ ఘటనపై అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి స్పందించారు. యజమానులకు ఫైర్ సేఫ్టీని పెట్టుకోమని చెప్పినా నిర్లక్ష్యం చేశారని, ఇందులో షాప్ కీపర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.