టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నర్సింహయ్య నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
1999, 2004లో సీపీఎం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా నోముల విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో భువనగిరి ఎంపీగా పోటీ చేసినప్పటికీ.. ఓటమి చెందారు. ఆ తర్వాత 2013లో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత జానారెడ్డిపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో (2018) అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి జానారెడ్డిపై ఘన విజయం సాధించారు.
నోముల నర్సింహయ్య మృతి పట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవలే దుబ్బాక ఎమ్మెల్యే ఉన్న సోలిపేట రామలింగారెడ్డి మరణించిన విషయాన్ని మరువకముందే.. పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కన్నుమూయడంతో టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.