ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సస్పెన్స్‌ఖు తెరపడింది. పంచాయతీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లన్నంటినీ సుప్రీం కొట్టివేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్‌రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలను వినిపించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా వేసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం వాయిదా వేసినట్టు వివరించారు. వ్యాక్సినేషన్ కోసం 5 లక్షల మంది సిబ్బంది అవసరమవుతారని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే సుప్రీం మాత్రం ఎన్నికల నిర్వహణకు ఓకే చెప్పింది.