కందుకూరు సభలో 8 మంది మృతిచెందడంపై ఇప్పటికీ వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే.. ఇది కొనసాగుతుండగానే మరోసారి చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగింది.
గుంటూరులోని వికాస్ నగర్ లో టీడీపీ బహిరంగ సభ జరిగింది. జనం భారీగా తరలివచ్చారు. అయితే.. సభ అనంతరం చంద్రన్న కానుక పేరుతో చీరల పంపిణీ జరిగింది. ఆ సమయంలో తొక్కిసలాట జరిగి.. ముగ్గురు మహిళలు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.
స్పాట్ లో ఒకరు చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. సభా ప్రాంగణం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లిపోయాక ఈ తొక్కిసలాట జరిగింది. ఇటీవల కందుకూరులో జరిగిన టీడీపీ రోడ్ షోలోనూ తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో 8 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ఇప్పుడు గుంటూరులో కూడా రిపీట్ అయింది.
ఉయ్యూరు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ పాలనపై మండిపడ్డారు. 2022 మొత్తం విధ్వంసాలు, విద్వేషాలతో గడిచిందని విమర్శించారు. పేదలకు న్యాయం చేయాలని మొదట అనుకున్నది ఎన్టీఆర్ అని తెలిపారు. 1983లో కిలో బియ్యం రూ.2కే ఇచ్చిన ఘనత ఆయనదేనని చెప్పారు. ఇవాళ్టి ఆహార భద్రత పథకానికి స్ఫూర్తి.. ఎన్టీఆర్ అని తెలిపారు. పేదవాళ్లకు పక్కా ఇళ్లు ఉండాలని కోరుకున్నారని, టీడీపీ హయాంలో సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చామని, ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చామని గుర్తు చేశారు చంద్రబాబు.