గణతంత్ర వేడుకలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని ఆదేశాలిచ్చింది. కోవిడ్ 19 ను సాకుగా చూపి తెలంగాణ సర్కార్ గణతంత్రదినోత్సవ వేడుకలను ఆపడం ఏమాత్రం కరెక్ట్ కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఈ వేడుకల ఫై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం పాటించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పరేడ్ ను తప్పని సరిగా తెలంగాణ సర్కార్ నిర్వహించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పింది.
ఇక రిపబ్లిక్ డే వేడుకలు.. ప్రతీ ఏడాది పరేడ్ గ్రౌండ్ లోనే జరుగుతుంటాయి. రాష్ట్ర గవర్నర్ జాతీయ జెండా ఎగురవేస్తారు. కానీ, కరోనా కారణంగా గతేడాది ఈ వేడుకల్ని రాజ్ భవన్ కే పరిమితం చేశారు. పైగా కేసీఆర్ గానీ, ఇతర నేతలు గానీ ఎవరూ హాజరవ్వలేదు. అయితే.. ఈ ఏడాది పరేడ్ గ్రౌండ్ లోనే రిపబ్లిక్ డే వేడుకలు ఉంటాయని అనుకుంటుండగా కేసీఆర్ సర్కార్ షాకిచ్చింది. ఈ ఏడాది కూడా రాజ్ భవన్ లోనే వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం లేఖ పంపంది.
దీనిపై తమిళిసై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లేఖపై స్పందిస్తూ.. రాష్ట్రంలో వేడుకలు ఘనంగా జరగకపోవడం పట్ల ఆవేదన చెందారు. కరోనా పేరుతో వేడుకలు జరపకపోవడం బాధాకరమని వాపోయారు. దీంతో ఈసారి కూడా రాజ్ భవన్ లోనే గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. గవర్నర్ గురువారం జాతీయ పతాకం ఆవిష్కరించి.. ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లనున్నారు. ఈక్రమంలో హైకోర్టు ఈ ఆదేశాలివ్వడంతో తెలంగాణ సర్కార్ కు షాక్ తగిలినట్లైంది.