శ్రీచైతన్య కాలేజీలో మరో సారి దారుణం చోటుచేసుకుంది. షాద్ నగర్ కు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నార్సింగ్ కాలేజీ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్ రాత్రి పదిన్నర గంటల సమయంలో క్లాస్ రూంలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
అయితే కాలేజీ యాజమాన్యం ఒత్తిడి కారణంగానే సాత్విక్ ఇలా చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇంత జరిగిన సాత్విక్ ఆత్మహత్యపై శ్రీచైతన్య యాజమాన్యం స్పందించకపోవడం పై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక ప్రాణపాయ స్థితిలో ఉన్న విద్యార్థిని కనీసం ఆస్పత్రికి కూడా తీసుకెళ్ళలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
దీంతో సాత్విక్ ను కిందకు దించిన విద్యార్థులు రోడ్డుపై వెళుతున్న బైకర్ ను లిఫ్ట్ అడిగి ఆస్పత్రికి తరలించడం గమనార్హం. కాగా అప్పటికే సాత్విక్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మరో వైపు కనీసం అతడి తల్లిదండ్రులకు విషయం చెప్పి..వాళ్లు వచ్చేంత వరకు కూడా ఆగకుండా.. డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించింది యాజమాన్యం.
అయితే గతంలో సాత్విక్ ను లెక్చరర్స్ కొట్టడంతో 15 రోజుల పాటు ఆస్పత్రి పాలయ్యాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆ సమయంలోనే అతన్ని ఏం అనొద్దని యాజమాన్యానికి బతిమిలాడుకున్నామని, అయినా కాని యాజమాన్యం వినలేదన్నారు. తమ కొడుకు మృతికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
సాత్విక్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. కాగా ఆత్మహత్య వెలుగు చూడగానే వార్డెన్ నరేష్ గోడ దూకి పారిపోయాడు. మరి ఈ సంఘటనపై శ్రీచైతన్య యాజమాన్యం ఎలా స్పందిస్తుందనేది చూడాలి. మరో వైపు సాత్విక్ తల్లిదండ్రులు నార్సింగ్ పోలీసు స్టేషన్లో వార్డెన్ నరేష్ తో పాటు కృష్ణా రెడ్డిలపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.